కూచిపూడి నృత్యం – అద్భుత ప్రయోగం
కీII శేII డాII వెంపటి చిన్న సత్యం గారు
క్షితోరత్నఛాయ ఫలన ముదకే వీచిలలితం
శిఖిన్యర్చి ప్రజ్ఞ సహజగతి వైచిత్ర్య మనిలే
తటిత్క్రీడా వ్యోమ్నిత్యకృత సుభగః పఙ్గ్న సుపరః
ప్రవిష్టో భూతేషు ప్రభవతి హినృత్తస్య మహిమః
తాII రత్న కాంతుల తళతళలు భూమి యందు, తరంగముల లాలిత్యము నీటి యందు,
జ్వాలాల హేల అగ్నియందు, సహజమైన వింత హొయలు వాయువునందు, మెరుపుతీగల యాట
గగనము నందు. ఈ విధముగా సహజ సుందరమైన నృత్యకళా మహిమ పంచభూతముల యందు
ప్రవేశించి ప్రకాశించుచున్నది.
కర్మభూమి అయిన భారతదేశం లలితకళలకు కాణాచి. కళలరువది నాలుగు కాగా , అందు
సంగీత, కవిత్వ, శిల్ప, చిత్రలేఖన, నాట్యములనే అయిదింటిని పృధిక్కరింపబడి
లలిత కళలుగా వ్యవహృత మగుచున్నవి. ఈ లలిత కళలు అయిదింటిలో కడపటిదైన
నాట్యము, సంగీత, కవిత్వ, శిల్ప , చిత్రలేఖనములు, ఆంగిక, వాచిక, ఆహార్య,
సాత్వికాభినయములతో సమాహారకళ స్వరూపముగా ఆరాధింపబడుచున్నది . అటువంటి
కళలకు మానవ జీవితమునకు ఉన్న అనుభందము విడదీయలేనిది అనుటలో అతిశయోక్తి
గానరాదు.
మానవుని జనన ఎప్పుడు సంభవించినదో , ప్రకృతి ఎప్పటినుండి ఆవిర్భవించి
యున్నదో , అప్పటి నుండే ఈ కళలు ఉద్భవించి యున్నవని చెప్పుటలో ఎటువంటి
సందేహము లేదు.
యోయం స్వభావో లోకస్య సుఖ దుఃఖ సమన్వితః
సోంగాధ్యభినయా పేతో నాట్యమిత్య బిధీయతే ॥
లోకో భిన్న రుచిః
ఏత చతుర్విధోపేతం నటన త్రివిధం స్మృతమ్
నాట్యం నృత్యం నృత్తమితి మునిభిః భారతాబిః॥
సుఖ-దుఃఖ సమన్వితమైన ఈ లోక స్వభావమును అంగాద్యాభినయోపేతము అగుచు,
నాలుగు అభినయములతో కూడిన నటన, నాట్య, నృత్య, నృత్త భేధములతోనూ భరత విద్య
మూడు విధములుగా రూపొందినదని 1. లయవిన్యాసము 2. తాళవిన్యాసము 3.
భావవిన్యాసము గా పేర్కొన్నబడినదని భరతుడు మొదలగు మునులు పేర్కొనిరి.
మానవుని కరచరణావయవ కదలికలే భావ వ్యక్తీకరణకు సంకేతములుగా
ఉపయోగింపబడినది. మొట్టమొదటిగా నేర్పే మొదటి అడుగులోనే అద్భుత ప్రయోగంతో
ఆరంభమౌతుంది మన “కూచిపూడి నృత్యం”.
“తాందిగిదిగితై తత్తహత్తతై....” అన్న మృదంగ జతి విన్యాసము లయబద్దముగా
శరీరాకృతిని ఒద్దికగా మలచి, మనస్సుని కేంద్రీకరించి చేసే పద్దతి. అలా
సాధనలో చతురశ్రము లోనూ, తిశ్ర, ఖండ, సంకీర్ణ, మిశ్ర జతులతో దాదాపు 70
అడవులను 23 జతులను వివిధ అంగవిన్యాసములతో అభ్యాస సాధన జరుగుతుంది.
మన పూర్వీకులైన కూచిపూడి వాస్తవ్యులు పూర్వ గురువుల విద్యను
ఎక్కువగా యక్షగానములు, లోకోత్తర నృత్య నాటకములు, భామాకలాపము,
గొల్లకలాపము మున్నగు నృత్య నాటకముల యందు, శబ్ధముల యందు
పేరెన్నికగొన్నవారు.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే “సంగీత పితామహుడైన
పురందర దాసు” గారి రచనలు ప్రకారం సంగీత సాధనను ఎలా ప్రారంభిస్తామో
అలాగనే ప్రస్తుతి “కూచిపూడి నృత్య” సాధనకు అనువుగా “నాట్యశాస్త్రాను”
సారముగా ఒక క్రమ పద్దతిలో అడవులను ప్రయోగించిన ఘనత “కీII శేII డాII వెంపటి
చిన్న సత్యం గారిది”. పక్కాగా సాధన ప్రక్రియను ఏర్పరిచి ఎన్నో
ప్రయోగములను తయారు చేసిన ఘనత వీరిదే.
పూర్వీకులు ఏర్పరిచిన శబ్ధములు కలాపములనే గాక పలు విధములైన
కీర్తనలను, పదములు, జావళీలు, తరంగములు, అష్టపదులు, త్యాగబ్రహ్మ,
అన్నమాచార్య కృతులను, సంగీత పితామహుని పురందరదాసు కీర్తనలను, ఉత్తైకాడ్
వెంకట సుబ్బయ్యర్ కీర్తనలను, తరంగములను ఎన్నో అంశములను నాట్య, నృత్తి,
నృత్యములతో మేళవించి అద్భుత ప్రయోగములు గావించిరి.
బ్రహ్మాంజలి (పూర్వరంగం)
“ఆంగికం భువనం యశ్య వాచికం సర్వ వాంగ్మయం
ఆహార్యం చంద్ర తారాదీతం వందే నమః సాత్త్వికం శివం”
చరాచర రూపమైన ఈ ప్రపంచం అంతా “శివుని” “ఆంగికాభినయం”
వాంగ్మయమంతా “వాచికాభినయం” “చంద్ర నక్షత్రాదులు” “ఆహార్యాభినయం”
సాత్వికుడైనట్టి (సాత్వికాభినయ స్వరూపుడైన) నటరాజునకు ఆది గురువునకు
నమస్కారముతో మొట్ట మొదటి నృత్యాంశమును ప్రారంభించియున్నారు.
సభాకల్ప తరుర్భాతి వేద శాఖోప శోభితః
శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వత్ భ్రమర సంయుతః
కళారంగమునందు కొలువైయున్న విశిష్ట అధితులు పండితులు నృత్య
కళాకారుని విద్వత్తును (విరులయందు మకరందమును గ్రోలుచున్నతుమ్మిదవలె)
ఆస్వాదించుచు, ఆశీర్వదించ వలయునని అంజలి ఘటిస్తూ చేసే అద్భుత
నృత్యాంశము.
అలా ప్రారంభ నృత్యాంశము మొదలుకొని, నృత్త-నృత్య-నాట్యంసములను
ఎన్నిటినో రూపకల్పన గావించి ఘనత సాధించారు. తాళ స్వరూపాన్ని సమగ్రంగా
అధ్యయనం చేసి తీరికలు, ముక్తాయిలు, జతులు, తాళానుగుణంగా, మనోధర్మ
స్థితిని వ్యాకరణ బద్దంగా, కొనుగోలు వంటి అంశాలను తాళదశ ప్రాణములను
కైవసం చేసుకుని “తాళ-నృత్య-వాద్య-గీత” ఉత్పత్తి క్రమాన్ని విద్యార్ధిని-
విద్యార్డులకు తెలుపుచూ, కరణ అంగహారములను శిక్షణలో భాగం చేసి, సంగీత-
సంస్కృత-శిక్షణనిప్పిస్తూ, నృత్య సాధన కొనసాగించేవారు. 108 అక్షరములతో
బాలమురళీకృష్ణ గారి కౌత్వము మిశ్ర జతి శివాష్టకము విశేష ప్రయోగములు
పాదముల పదబంధములతో తరంగములను, అభినయ విశేషములు కలిగిన జావళి,
పదములు, లోకోత్తర, లోక కళ్యాణ కీళికలు సృష్టించారు. వాద్య ప్రకరణమునకు,
తాళ, జతులకు, గాత్ర మాధుర్యామునకు తగ్గట్లుగా దీని ప్రత్యేకతను దానికి
చూపిస్తూ నృత్యాంశములను విరివిగా రూపకల్పన గావించి స్వర్గలోక
మార్గమును చూపించి రసావిష్కరణ గావించి ముగ్ధులను చేయుటలో ప్రతిభ చాటిన
ఘనత వీరి సొంతం.
గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
పూజ్యులు దైవసమానులు డాII పద్మభూషణ్ చినసత్యం గారి గురించి నేను
చెప్పడం అంటే కొండని అద్దంలో చూపడమే! ఆధునిక కూచిపూడి రంగస్థల ఉపకరణాల
అవస్యకతను, బహిప్రాణముల అవశ్యకతను పెంపొందించి తనదైన బాణిలో అనేక
ప్రత్యేకతలతో బహుముఖినయైన ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలతో కూచిపూడి
నాట్యకళకు అంతర్జాతీయ ఖ్యాతితో పాటు ఈ నాట్య కళా వికాసానికి దోహద
పాడడానికి అత్యంత కృషిసల్పిన మహానుభావులు.
“జ్ఞానం, చిల్పం, నసా విద్యా
నసాకళా! యోగో నతత్ కర్మ నాట్యాస్మిన్‌యన్న దృశ్యతే”
“ నాట్యం భిన్న రుచీర్జనస్య బహుదాప్యెకం సమారాధనం”
“వేద విద్యతి హసానామాఖ్యాన పరికల్పనమ్
వినోద కరణం లోక నాట్యం తద్ధభవిష్యతి”
నానా భావోప సంపన్నం – నానా వస్ధాo త రాత్మకం
లోకవృత్తాను కరణం నాట్యం తన్మయాకృతం”
పూర్వం కూచిపూడి కళను ఒక జానపద కళగా చిన్నచూపు చూచుట తట్టుకొనలేక
నిరంతర కృషితో శాస్త్రీయమైన పంధాలో భరతుని నాట్యాశాస్త్రము నందు
వివరించిన అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నవాటిని మరికొంత
అందమును చేకూర్చి ప్రతి చలనము ఒక శిల్పముగా చిత్తరుపోయినట్లుగా మలచిరి.
మనకున్న నాలుగు వేదాల సారము మిళితం చేస్కోని నాట్యం పంచమ వేధంగా
స్థిరపడింది.
కళలు భూతకాలాన్ని తెలియజేస్తూ, వర్తమాన కాలంలో దిక్షూచిగా,
భవిష్యత్తుకు వారధిగా మలచబడినవి.
ఇటువంటి గురువుల శుశ్రూశ వలన మనకు మంచి మార్గం లభిస్తుందనుటలో
అతిశయోక్తి లేదు.
నాట్యశాస్త్ర మర్యాదలు పాటిస్తూ పాత్రోచితముగా శిక్షణిస్తూ, సాటి
కళాకారులకు, సంప్రదాయముల విలువలు పాటిస్తూ, లాస్య, తాండవములను, శబ్ధ
భంధం, ఉచ్ఛారణ, ప్రదర్శనకు అనువుగా ప్రతి క్రియలో అమర్చిన విధానం “చిన్న
సత్యం” గార్కి వెన్నతో పెట్టిన విద్య.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా “ ఏక పాత్ర కౌళికలు”, నృత్య నాటకాలు” కీర్తి
బాహుటాను ఎగుర వేసి, కూచిపూడి నృత్యంనకు విశేష ఆదరాభిమానమములను
పొందిన్నట్లు చేసి, అందరినీ ఓకే తాటిపై నడిపించవలెనన్న కోరికతో
భారతావనిలో కూచిపూడి నాట్య సౌరభాలను విదజల్లారు. నభూతో-నభవిష్యత్ అన్న
చందమున భారతీయ నృత్య రీతులలో తలమునికముగా మన కూచిపూడి నృత్యం ఉండాలి అని
వారి ఆకాంక్ష.....కాపాడటం మన భాద్యత.
అందె అందె యందు శబ్దరూపం మీరు, పలుకు భావ రూపం మీరు, నడక యందు హోయలకు
హొయలునేర్పి, పాట యందు పలుకు భావం మీరు, పదము నందు లయకారులు మీరు, మీ వద్ద
విద్య నేర్చిన వారందరూ ధన్య జీవులు.