విజయాలయ చోళుడు
విజయాలయ చోళుడు | |
---|---|
పరకేసరి | |
దస్త్రం:Vijayalaya territories.png | |
పరిపాలన | సుమారు 847 – 871 CE Military career |
సేవలు/శాఖ | చోళ సైన్యం పల్లవ సామంతుడు (847CE – 860CE) |
పూర్వాధికారి | సురాధిరాజ చోళ |
ఉత్తరాధికారి | మొదటి ఆదిత్యచోళుడు |
జననం | ఉరైయూరు |
మరణం | సా.శ. 884 ప్రాంతంలో కాళహస్తి |
వంశము | మొదటి ఆదిత్యచోళుడు |
మతం | హిందూ మతం |
విజయాలయ చోళుడు ( తమిళం : விஜயாலய சோழன்) [1] చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన దక్షిణ భారతదేశానికి చెందిన రాజు. (సా.శ. 847-871) [2] అతను కావేరీ నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని పాలించాడు.
చోళుల చీకటి యుగం
[మార్చు]ప్రాచీన కాలంలో పేరొందిన చోళులు క్రీ.శ. 300 తర్వాతి కాలంలో తమ మాతృభూమి నుండి దాదాపు పూర్తిగా అదృశ్యమయ్యారు. ఈ కాలంలో వారు తమ ప్రాచీన రాజధానియైన ఉరైయూరుపై మాత్రం పట్టు నిలుపుకుని ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో తమిళ చరిత్రలో అంధయుగంగా చెప్పే సమయం పాండ్యులు, పల్లవుల ఆధిపత్యంతో ముగిసింది. 8వ శతాబ్ది రెండవ అర్థభాగంలో విజయాలయుడు రాజ్యానికి వచ్చాకా చోళుల ప్రాబల్యం పెరిగింది.
పాండ్యులు, పల్లవుల ఆధ్వర్యంలో చోళులు
[మార్చు]ఈ సుదీర్ఘ విరామంలో చోళుల గతి గురించి చాలా తక్కువ వివరాలు అందుబాటులో ఉన్నాయి.చోళుల ప్రాబల్యం అత్యల్ప స్థాయికి పడిపోయినప్పుడు, పాండ్యులు, పల్లవుల అధికారం వారికి ఉత్తర, దక్షిణాల్లో పెరిగిపోయి ఉండేది. ఆ దశలో ఈ పురాతన రాజవంశం విజయవంతమైన తమ ప్రత్యర్థుల క్రింద ఆశ్రయం, ప్రోత్సాహాన్ని పొందవలసి వచ్చింది. చోళులు అంతకు ముందు ఉన్నంత ప్రముఖులుగానూ, శక్తిమంతులుగానూ లేనప్పటికీ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడలేదు. ఆధునిక తమిళనాడులోని మైలాడుతురై, చిదంబరం, తంజావూరు, తిరుచ్చి, పుదుక్కొట్టై జిల్లాలతో కూడిన పరిమిత ప్రాంతంలో ఆధిపత్యాన్ని కొనసాగించారు.
విజయాలయ చోళుని వృద్ధి
[మార్చు]పాండ్యులు, పల్లవుల మధ్య జరిగిన యుద్ధంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని, విజయాలయుడు తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. విజయాలయుడు ప్రాచీన చోళ వంశానికి చెందినవాడన్న అతని వాదాన్ని ధ్రువీకరించడానికి చరిత్రకారులకు చాలాకాలం ఎటువంటి ఆధారాలు లేవు. మధ్యయుగ చోళ రాజవంశ స్థాపకుడిగా పరిగణించబడే విజయాలయ చోళుని పూర్వీకులను చాలాకాలం వరకు, చరిత్రకారులు గుర్తించలేకపోయారు. చరిత్రకారులు, ఎపిగ్రాఫిస్టులు తూర్పు చాళుక్యుల రాజు దానాన్ని ప్రస్తావించే రాగి ఫలకం, [3] రెండవపరాంతక చోళుని అన్బిల్ ఫలకాలు, [4] పరాంతక చోళుని వేలంజేరి ఫలకాలు[5] పరిశీలించి కరికాల చోళుని వారసులుగా చెప్పుకున్న ప్రాచీన చోళ వంశానికి విజయాలుడు చెందినవాడు కావచ్చని నమ్ముతున్నారు. విజయాలయ చోళుడి కాలంలో దక్షిణ భారతదేశ ఆధిపత్యం కోసం పల్లువులు, పాండ్యుల మధ్య గొప్ప పోరాటం జరిగింది. ఈ గందరగోళ స్థితిలో, విజయాలయుడు పాండ్యులను ఓడించి తంజావూరుకు, దాని చుట్టుపక్కల చోళ దేశానికి తనను తాను పాలకుణ్ణి చేసుకునేందుకు మంచి అవకాశాన్ని కనుగొన్నట్టు తెలుస్తోంది. అదే క్రమంలో అతను పల్లవులను కూడా ఓడించాడు.
విజయాలయ చోళుడు తంజావూరును ముత్తరయ్యర్ రాజవంశానికి చివరి పాలకుడు అయిన ఎలాంగో ముత్తరైయర్ నుండి స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ. 852లో విజయాలయ చోళుడు పాండ్యులతో యుద్ధం చేసి తరువాత వారిని ఓడించాడని చెబుతారు. పాండ్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో అవకాశాన్ని ఉపయోగించుకుని, విజయాలయుడు వృద్ధి చెంది ముత్తరైయర్ రాజు అయిన సత్తాన్ పలియిళ్ళి (826-852 CE) సహాయంతో తంజావూరులో చోళ రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాతి కాలంలో చోళుల ప్రాబల్యం ఎంతగా పెరిగిందంటే తంజావూరు ప్రాంతం నుంచి పల్లవులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు.
పాండ్యన్ దండయాత్ర
[మార్చు]విజయాలయుడు తంజావూరును స్వాధీనం చేసుకున్న తరువాత, పల్లవ రాజు మూడవ నందివర్మన్ (c. 846 – 869 CE) కు పాండ్యన్ రాజు రెండవ వరగుణవర్మన్ (c. 862 – 885 CE) లోబడి ఉండే మిత్రుడు అయ్యాడు. విజయాలయుని నేతృత్వంలో పెరుగుతున్న చోళుల ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని తగ్గించాలని ఆశించిన నందివర్మన్ విజయాలయుడిని అణచివేయడంలో తనకు సహాయం చేయమని వరగుణవర్మను పిలిచాడు. వరగుణుడు చోళ దేశంలోకి జరిగిన ఆ దండయాత్రకు నాయకత్వం వహించాడు. పాండ్యన్ సైన్యం తంజావూరు సమీపంలోని కావేరీ ఉత్తర తీరానికి చేరుకుంది. విజయాలయుడు ఈ సమయానికి అనేక యుద్ధాలలో పాల్గొని వృద్ధాప్యం మీదపడ్డవాడు అయ్యాడు. రాజకుమారుడు మొదటి ఆదిత్య చోళుడు సైన్యానికి నేతృత్వం వహించి చోళ రాజ్య సంరక్షణ బాధ్యత చేపట్టాడు. సా.శ. 871లో విజయాలయుడు మరణించాకా అతని కుమారుడైన మొదటి ఆదిత్యుడు రాజ్యానికి వచ్చాడు.
విజయాలయుని శాసనాలు
[మార్చు]విజయాలయుడు తంజావూరు నగరాన్ని స్వాధీనం చేసుకుని దానిని తన రాజధానిగా చేసుకున్నాడని, అందులో నిశుంభసూదని (దుర్గ) దేవతకి ఆలయాన్ని కూడా నిర్మించాడని తిరువళంగాడు ఫలకాలు పేర్కొంటున్నాయి. కన్యాకుమారి శాసనం అతను తంజావూరు నగరాన్ని పునర్నిర్మించినట్లు తెలుపుతుంది.
విజయాలయుడు పరకేసరివర్మన్ అన్న బిరుదును పొందాడు. అతని తరువాత వచ్చిన చోళ రాజులు పరకేసరి, రాజకేసరి అనే బిరుదులను మార్చుకుంటూ వాడుకున్నారు. బహుశా ఇది వారి పూర్వీకులైన పరకేసరి, రాజకేసరి అనేవారిని గుర్తుచేసుకోవడం కావచ్చు.
పుదుక్కొట్టైలోని నర్తమలైలో విజయాలయుడు నిర్మించాడని చెప్పే సోలేశ్వర ఆలయం ఉంది.
గమనికలు
[మార్చు]- ↑ "Translation". Google Translate.
- ↑ A Textbook of Medieval Indian History. Primus Books.
- ↑ "Epigraphia Indica Vol V". MANAGER OF PUBLICATIONS, DELHI.
- ↑ "Epigraphia Indica Vol.15". 1920.
- ↑ "Thiruttani and Velanjeri Copper Plates".
ప్రస్తావనలు
[మార్చు]- తమిళ, సంస్కృత శాసనాలు ప్రధానంగా 1886 - 87లో సేకరించబడ్డాయి, E. Hultzsch, Ph.D., ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ప్రచురించింది
- నీలకంఠ శాస్త్రి, KA (1935). CōĻas, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, మద్రాస్ (1984లో పునర్ముద్రించబడింది).
- నీలకంఠ శాస్త్రి, KA (1955). ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, OUP, న్యూఢిల్లీ (పునర్ముద్రితం 2002).
అంతకు ముందువారు {{{before}}} |
{{{title}}} | తరువాత వారు {{{after}}} |