పంచేటి కోటేశ్వరం
పంచేటి కోటేశ్వరం (1915-1997) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త.[1]
జీవిత విశేషాలు
[మార్చు]పంచేటి కోటేశ్వరం నెల్లూరు జిల్లాలో మార్చి 20, 1915 న జన్మించారు. ప్రాథమిక విద్యను నెల్లూరులో అభ్యసించారు. 1931 లో ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యలో మొదటి స్థానం సాధించారు. ఈ విజయానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం "సర్ ఆర్.వెంకటరామన్" గోల్డ్ మెడల్ ను యిచ్చి సత్కరించింది. 1939 లో ప్రెసిడెన్సీ కాలేజీలో బి.యస్సీ డిగ్రీని పూర్తిచేశారు. 1943 లో శ్రీ టి.రామకృష్ణారావు అధ్వర్యంలో రామన్ ఎపెక్టు పై పరిశోధన చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాను పొందారు.
ఉద్యోగ జీవితం
[మార్చు]తొలుత ఇండియన్ మెటియొరాలజీ సర్వీసులో అసిస్టెంటు వాతావరణ శాస్త్రవేత్తగా 1940 లో చేరారు. ఆ తర్వాత ఇండియన్ మెతియొరోలాజికల్ డిపార్టుమెంటుకు డైరక్టరు జనరలుగా వ్యవహరించారు. ఇరాన్ ప్రభుత్వంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజరు నిపుణునిగా, వాతావరణ విభాగ సలహాదారుగా (1975-78) పనిచేశారు. స్వరాష్ట్రంలో ఆంధ్రా యూనివర్శిటీ లోని మెటియొరోలజీ అండ్ ఓషనోగ్రఫీ విభాగానికి గౌరవ ఆచార్యులుగా (1972-82) పనిచేశారు.
పరిశోధనలు, సేవలు
[మార్చు]ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి 1974 లో ఫెలోగా ఎన్నికైనారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థల నుండి ఫెలోషిప్ లను అందుకున్నారు. ఇండియన్ మెటియొరోలాజికల్ సొసైటీకి కొంతకాలం అధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలందించారు. డాక్టర్ కోటేశ్వరం వాతావరణ శాస్త్రంలో, దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వివిధ రంగాలలో వాతావరణ శాస్త్ర వినియోగానికి లోతైన పరిశోధనలు చేశారు. 1963 లో పూనాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియొరోలజీకి, 1960-65 నడుమ న్యూఢిల్లీలోని నార్తన్ హిమిస్ఫియర్ ఎక్సేంజి అండ్ ఎనాలసిస్ సెంటర్ ల స్థాపనకు విశేష కృషి చేసి అఖండ విజయం సాధించారు. ఆయన మార్గ దర్శకత్వంలోనే 1970-73 దేశంలోని తూర్పు కోస్తా తీరం వెంబడి తుఫాను హెచ్చరికల రాడార్ ఛెయిన్ సిస్టం యేర్పాటయింది. అంతేకాదు, ఉత్తర భారతదేశాం, మధ్య భారతదేశంలోనూ వరదలను సృష్టించే నదుల ఆయకట్టుల వద్ద ప్లడ్ మెటియొరాలజీ సెంటర్లను స్థాపించారు. తన వాతావరణ శాఖ వారితో సాటిలైట్ - మోనటరింగ్ సిస్టాన్ని రూపకల్పన చేసి, నెలకొల్పి వాతావరణ విభాగం వారి సేవలని ఆధునికం చేశారు. శీతోష్నస్థితి సంబంధ ప్రయోజనాల కొరకు ముందస్తు సమాచార గ్రహనానికి, గణాంకాల అంచనాలకు కంప్యూటర్లను వినియోగించి దేశీయ వాతావరణ శాస్త్రంలో కొత్త పేజీలను ఆవిష్కరించారు. ఋతుపవనాలు, అల్పపీడనములు, తుఫానులు, వాతావరణ మార్పులు, వరదలు మొదలైన అంశాల మీద గణనీయమైన పరిశోధనలు చేశారు. అవిశ్రాంత కృషి జరిపారు.
వరల్డ్ మెటియొరోలాజికల్ ఆర్గనైజేషనుకు అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షునిగా (1971-75) అఖండ సేవలు అందించారు. ఆంధ్రా యూనివర్శిటీ వారి గౌరవ పురస్కారం డి.ఎస్.సి అందుకున్నారు. 1975 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
వాతావరణ శాస్త్ర రంగంలోపరిశోధనలు జరపడానికి చికాగో (అమెరికా) మియామి దేశాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళారు. ప్రపంచ వాతావరన సంస్థకు గౌరవ సభ్యులుగా ఎంపికయ్యారు. దేశ, విదేశీ ప్రముఖ సైన్స్ మేగజైన్ లలో 70 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ". Archived from the original on 2016-03-04. Retrieved 2015-02-06.