ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల, నత్తల శ్వాసవ్యవస్థలోని ప్రధాన అవయువాలు. ఇవి క్షీరదాల్లో, ఇంకా చాలా సకశేరుకాల్లో వెన్నెముక సమీపంలో గుండెకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి ప్రాణవాయువు (oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది. మానవులు మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే.
మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి వక్షస్థల భాగంలో ఉరఃకుహరంలో (thorasic cavity) ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఉరఃకుహరంలో ఎడమవైపు స్థలాన్ని ఎడమ ఊపిరితిత్తి, గుండె పంచుకుంటాయి. ఊపిరితిత్తులు రెండూ కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఎడమదానికన్నా కుడి ఊపిరితిత్తి బరువుగా ఉంటుంది.
ఊపిరితిత్తుల్లోని కణజాలం వివిధ రకాలైన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వలన దెబ్బతినే అవకాశం ఉంది. వీటిలో న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధానమైనవి.
మూలాలు
[మార్చు]- ↑ Gray's Anatomy of the Human Body, 20th ed. 1918.
బయటి లింకులు
[మార్చు]- Lung Function Fundamentals. http://www.anaesthetist.com/icu/organs/lung/lungfx.htm
- Dr D.R. Johnson: Introductory anatomy, respiratory system Archived 2009-11-24 at the Wayback Machine
- Franlink Institute Online: The Respiratory System
- Lungs 'best in late afternoon'
- Chronic Respiratory Disease - leading research and articles on respiratory disease Archived 2006-10-17 at the Wayback Machine.