ఈదుల్ అజ్ హా
ఈద్ అల్-అజ్ హా (అరబ్బీ: عيد الأضحى ‘Īd ul-’Aḍḥā) ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్.[1] (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.
ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.
నేపద్యం
[మార్చు]అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్. ఇస్లాం క్యాలెండర్‌లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాహ్‌పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్ అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్ ఇబ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లాహ్ వారికి సంతానప్రాప్తి కలిగించారు. లేక లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్‌ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడ్తారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్ కూడా అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్తారు. బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్‌తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలిఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్‌ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను ప్రత్యక్ష పరుస్తారు. దీందో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్మార్గంలో అది ఖుర్బాన్ అవుతుంది.ఇబ్రాం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగను జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలనీ, నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.
ఈదుల్ అజ్ హా కు ఇతర పేర్లు
[మార్చు]- 'ఈద్ అల్-కబీర్' : (మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, ఈజిప్టు, , లిబియా దేశాలలో)
- 'ఫస్కా తమొఖ్ఖార్త్' : (పశ్చిమ ఆఫ్రికా దేశాలలో)
- 'బబ్బర్ సల్లాహ్' : (నైజీరియా లో)
- 'సిద్వైనీ' : (సోమాలియా, కెన్యా , ఇథియోపియా లో)
- 'బడీ ఈద్' లేదా బక్రీద్ : (భారతదేశం, పాకిస్తాన్ లో)
- 'వలీయా పెరున్నల్' : (కేరళ లో)
- 'ఖుర్బానీ ఈద్' : (బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా లో)
- 'పెరునాల్' : (తమిళనాడు లో)
- 'కుర్బాన్ బైరామి' : (టర్కీ, అజర్బైజాన్ లో)
- 'కుర్బాన్ బజ్రామ్' : (బోస్నియా , హెర్జెగొవీనా, అల్బేనియా, కొసావో , బల్గేరియా లో)
- 'కుర్బాన్ బైరమే' : (తాతారిస్తాన్ లో)
- 'కుర్బాన్ బైరామ్' : (రష్యా లో)
- 'కుర్బాన్ ఆయిత్' : (కజకస్తాన్ లో)
- 'ఈద్ ఎ ఖోర్బాన్' : (ఇరాన్ , ఆఫ్ఘనిస్తాన్ లో)
- 'లోయే అక్తర్' లేదా 'కుర్బానియే అక్తర్' : (పుష్తో భాషీయులు)
- 'కుర్బాన్ ఈత్' : (చైనా , ఉయ్ ఘుర్ భాషలో)
* 'ఈదుల్ అద్ హా' : (మలేషియా, సింగపూర్, ఇండోనేషియా , బ్రూనై లో)
సాంప్రదాయాలు , సంస్కృతి
[మార్చు]ఇబ్రాహీం (Ibrāhīm - إبراهيم) |
---|
(Arabic audio with English meaning) .
అల్లాహ్ పేరున بسم الله , అల్లాహ్ మహాశక్తిమంతుడు والله أكبر ఓ అల్లాహ్, సత్యముగా ఇది నీనుండే , నీ కొరకే اللهم إن هذا منك ولك ఓ అల్లాహ్ నా నుండి స్వీకరించు اللهم تقبل مني
ఖుర్బానీ మాంసమును ప్రజలకు పంచడం ఈ ఈద్ లోని భాగం. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు పోవడం రివాజు, ఇస్లాం విధివిధానాల్లో ఐదో విధానం అయిన హజ్ (మక్కాయాత్ర) ఇదే రోజున మక్కాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ముస్లింలు మక్కా మసీదులోని కాబా దర్శనం చేసుకుంటారు.. 40 రోజుల హజ్‌యాత్రలో భాగంగా మక్కా, మదీనాల్లో నమాజు ఆచరిస్తూ.. సైతానుకు రాళ్లు వేసే ప్రక్రియలో పాల్గొంటూ దైవారాధనలో గడుపుతారు.
ఈదుల్ అజ్ హా గ్రెగేరియన్ కేలెండరులో
[మార్చు]ఇస్లామీయ కేలండర్ లో ఈదుల్ అజ్ హా ఒకే దినంలో వచ్చిననూ గ్రెగేరియన్ కేలండరులో తేదీలు మారుతాయి. దీనికి కారణం ఇస్లామీయ కేలండర్ చంద్రమాసాన్ననుసరించి , గ్రెగేరియన్ కేలండర్ సూర్యమాసాన్ననుసరించి వుంటుంది. చంద్రమాన సంవత్సరం, సూర్యమాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ.[2] ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కానరావడమే.
ఈ క్రింది పట్టిక ఈదుల్ అజ్ హా యొక్క అధికారిక దిన పట్టిక. దీనిని సౌదీ అరేబియాకు చెందిన సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ప్రకటించింది.
- 1422 (ఇస్లామీయ కేలండర్) : ఫిబ్రవరి 22, 2002
- 1423 (ఇస్లామీయ కేలండరు) : ఫిబ్రవరి 11, 2003
- 1424 (ఇస్లామీయ కేలండరు) : ఫిబ్రవరి 1, 2004
- 1425 (ఇస్లామీయ కేలండరు) : జనవరి 20, 2005 ప్రకటించబడినది - లెక్కించబడిన తేది : జనవరి 21, 2005
- 1426 (ఇస్లామీయ కేలండరు) : జనవరి 10, 2006
- 1427 (ఇస్లామీయ కేలండరు) : డిసెంబరు 30, 2006 ప్రకటించబడినది - లెక్కించబడిన తేది: డిసెంబరు 31, 2006
- 1428 (ఇస్లామీయ కేలండరు) : డిసెంబరు 19, 2007 ప్రకటించబడినది - లెక్కించబడిన తేది: డిసెంబరు 20, 2007
- 1429 (ఇస్లామీయ కేలండరు) : డిసెంబరు 8, 2008 (లెక్కించబడినది)
- 1430 (ఇస్లామీయ కేలండరు) : డిసెంబరు 27, 2009 (లెక్కించబడినది)
- 1431 (ఇస్లామీయ కేలండరు) : నవంబరు 16, 2010 (లెక్కించబడినది)
- 1432 (ఇస్లామీయ కేలండరు) : నవంబరు 6, 2011 (లెక్కించబడినది)
- 1433 (ఇస్లామీయ కేలండరు) : అక్టోబరు 26, 2012 (లెక్కించబడినది)
- 1434 (ఇస్లామీయ కేలండరు) : అక్టోబరు 15, 2013 (లెక్కించబడినది)
- 1435 (ఇస్లామీయ కేలండరు) : అక్టోబరు 4, 2014 (లెక్కించబడినది)
- 1436 (ఇస్లామీయ కేలండరు) : సెప్టెంబరు 23, 2015 (లెక్కించబడినది)
- 1437 (ఇస్లామీయ కేలండరు) : సెప్టెంబరు 11, 2016 (లెక్కించబడినది)
- 1438 (ఇస్లామీయ కేలండరు) : సెప్టెంబరు 1, 2017 (లెక్కించబడినది)
- 1439 (ఇస్లామీయ కేలండరు) : ఆగస్టు 21, 2018 (లెక్కించబడినది)
- 1440 (ఇస్లామీయ కేలండరు) : ఆగస్టు 11, 2019 (లెక్కించబడినది)
- 1441 (ఇస్లామీయ కేలండరు) : జూలై 31, 2020 (లెక్కించబడినది)